సారంగి ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ

* ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయం - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

తెలుగు సినిమాల్లో ప్రతిభ చాటుతున్న నటీనటులను ప్రోత్సహించడం అభినందనీయం అని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కార్యాలయంలో సారంగి ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభరతి ప్రధాన వేదికపై సారంగి ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. ఇందులో సినిమా రంగానికి చెందిన పలు కేటగిరీలో అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్ ను రాఘవేద్రరావు ఆవిష్కరించడంతో పాటు సారంగి అధినేత ఖాజా అఫ్రిది ను అభినందించారు. ఈ సందర్భంగా ఖాజా అఫ్రిది మాట్లాడుతూ సారంగి ఆధ్వర్యంలో
సామాజిక  సేవా రంగాల్లో పదేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎంతో మంది దివ్యాంగులకు చేయుతనందిస్తూ వస్తున్నామని తెలిపారు. సారంగి ప్రయాణంలో భాగంగా సారంగి ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించ తలపెట్టామని తెలిపారు . ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా సినిమా రంగంలో ప్రతిభ చాటుతున్న నటీనటులకు సారంగి  ఫిల్మ్ అవార్డ్స్ అందజేయనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు పలువురు సామాజికవేత్తలను సత్కరించుకోనున్నారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ దర్శకులు వేణు ఉడుగుల, తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. సారంగి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖాజా అఫ్రిది కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పి. సుమన్, సిల్వేస్టర్, శ్రీకాంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments