కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జా నాయ‌కుడైన‌ `వంగ‌వీటి రంగా` పాత్ర‌లో న‌టించ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం -సురేష్ కొండేటి

కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జా నాయ‌కుడైన‌ `వంగ‌వీటి రంగా` పాత్ర‌లో న‌టించ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం -సురేష్ కొండేటి

బెజ‌వాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగ‌వీటి రంగా .. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌థ‌తో సినిమా తెర‌కెక్కి రిలీజ‌వుతోంది. దేవినేని కోణంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `దేవినేని` అనే టైటిల్ ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. `బెజవాడ సింహం` అనేది ఉప‌శీర్షిక‌. శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటించ‌గా..వంగవీటి రంగా పాాత్రలో ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ సుప‌రిచితుడు .. సంతోషం అధినేత‌.. నిర్మాత సురేష్ కొండేటి న‌టించారు. చారిత్రక నేపధ్యంలో రూపుదిద్దుకొని కమర్షియల్ హంగులతో ఈ శుక్ర‌వారం (మార్చి 5న‌) విడుదల కానుంది. 

సినిమాలో రంగా పాత్రలో నటించిన నిర్మాత, సంతోషం సినీ మాగజైన్ అధినేత కొండేటి సురేష్ మాట్లాడుతూ-``బెజవాడ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. వాటికి బిన్నంగా మా సినిమా దేవినేని ఉంటుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వంగవీటి మోహనరంగా పాత్రలో నటించాను. అందుకే తొలుత బందరురోడ్డు లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించాను. సినిమా అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చేలా మా దర్శకుడు శివ నాగు తెర‌కెక్కించారు. అన్ని క్యారెక్టర్స్ ను చక్కగా మలిచారు. నిర్మాతలకు నా ధ‌న్య‌వాదాలు. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది`` అని తెలిపారు. 

మ‌రిన్ని సంగ‌తులు చెబుతూ..ఎవరిని కించ పరిచే ఉద్దేశంతో సినిమా ఉండదు. గతంలో జరిగిన అనేక సంఘటనలను పరిణామాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి. చాలా మంది కొత్త నటులు ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. బెజవాడ నేపధ్యంలో వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే దేవినేని సినిమాను కూడా ఆదరిస్తార‌ని ఆశిస్తున్నాం. వంగవీటి రంగా గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నా. రంగా గారూ మన దేశానికి స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు ...1947 జూలై 4వ తేదీన‌ జన్మించారు. బహుశా అందుకే ఆయన స్వతంత్రభావాలతో పెరిగార‌ని భావిస్తాను. 

కులమతాలకు అతీతంగా ఆయన జీవితం సాగడం విశేషం. రంగా గారి అన్న రాధా గారిని 1974లో హత్య చేసిన తర్వాత అన్నగారి అనుయాయుల్ని ఆదుకోవడానికి విజయవాడలోని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటడానికి రంగా గారు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1980లో విజయవాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఆయన 40వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన జైలు లో ఉండి గెలిచారంటే... ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ రాజధాని విజయవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.

రంగా గారంటే ఓ ప్రభంజనం... ఓ ఉత్తేజం... ఓ ఉత్సాహం... నిజం చెప్పాలంటే ఆయన శాసన సభ్యుడిగా ఉన్నది కేవలం మూడు సంవత్సరాలే... అయితే... ఓ ముఖ్యమంత్రికి వచ్చినంత గుర్తింపును ఆయన పొందారు. ఆయనను చాలామంది ఒక కుల నేతగా గుర్తిస్తారు. కానీ ఆయన జీవితాన్ని... జీవన విధానాన్ని గమనిస్తే... అందులో నిజం లేదని మనకే తెలుస్తుంది. పీడిత తాడిత ప్రజల పక్షానే కాదు... పౌర హక్కుల సాధనలోనూ ఆయన ముందున్నారు.

1985లో ఎన్ కౌంటర్ పత్రిక అధినేత, సంపాదకుడు పింగళి దశరథ్ రామ్ ను హత్య చేసినప్పుడు రంగా పోరాడారు. 1986లో నేవీ ఆఫీసర్ మురళీధర్ ను విచారణ పేరుతో పోలీసులు స్టేషన్ కు పిలిచిన అనంతరం ఆయన అనుమానాస్పద మృతికి వ్యతిరేకంగా రంగా పోరాడారు. ముదిగొండ పద్మ అనే మహిళకు పోలీసులు శిరోముండనం చేస్తే... పోలీస్ స్టేషన్స్ ను రంగా ముట్టడించారు. ఇక ఎన్టీఆర్ పై జరిగిన ఉత్తుత్తు దాడిలో పాత్రధారి అయిన మల్లెల బాబ్జీ ఆత్మహత్య కేసును ప్రభుత్వం నీరుకార్చుతుంటే... రంగా దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తన గళం విప్పి... శ్రీరాములు కమిటీని వేసేలా చేశారు. ఇలా అన్ని సందర్భాలలో ఆయన అన్ని కులాల వారికీ న్యాయం చేయడానికి ప్రయత్నించారు. అలానే కాపులకు అండగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపారు. అలాంటి గొప్ప ప్రజానాయకుడు రంగా గారి పాత్రను పోషించడం నిజంగా నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను.

ఇవాళ మన రాష్ట్రంలోని ఆయనకున్నవి విగ్రహాలు మరే నాయకుడికీ లేవు. అయితే... ఆయన ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవడమే మనం చేయాల్సింది. ఈ పాత్ర చేసినప్పుడు కూడా నేను దానిని మనసులో పెట్టుకున్నాను. నటుడిగా ఇప్పుడిప్పుడే నన్ను నేను నిరూపించుకుంటున్న టైమ్ లో రంగా గారి పాత్ర పోషించమని దర్శక నిర్మాతలు కోరగానే... అంగీకరించడానికి కారణం కూడా అదే! ఈ పాత్ర ద్వారా నేను ఆయనకు సరైన రీతిలో నివాళులు అర్పించానని భావిస్తున్నాను. నా నట జీవితంలో ఇదో మరపురాని పాత్రగా మిగిలిపోతుంది... అని సురేష్ కొండేటి తెలిపారు.

Post a Comment

0 Comments