"A" Movie Review and rating

"A" Movie Review and rating

నటీనటులు - నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని

సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్, సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాత: గీతా మిన్సాల దర్శకత్వం: యుగంధర్ ముని.


గుండెల్లో గోదారి, మళ్లీ రావా లాంటి చిత్రాల్లో బాల నటిగా కనిపించి పేరు తెచ్చుకున్న తార ప్రీతి అస్రానీ. నితిన్ ప్రసన్న అనే కొత్త హీరోతో కలిసి ఆమె నటించిన సినిమా ఏ, యాడ్ ఇన్ఫనైటైమ్. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యుగంధర్ ముని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఏ, యాడ్ ఇన్ఫనైటైమ్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం...


కథేంటంటే

రోడ్డు ప్రమాదంలో గాయపడి, వికలాంగుడైన యువకుడు సంజీవ్ (నితిన్ ప్రసన్న). అతనికి చికిత్స చేసి బతికిస్తుంది నర్సు పల్లవి (ప్రీతి అస్రానీ). ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ మొదలై, పెళ్లి చేసుకుంటారు. వీరికో పాప అమ్ము జన్మిస్తుంది. అమ్ము నవ్వులతో సంజీవ్, పల్లవి వైవాహిక జీవితం హాయిగా సాగిపోతుంటుంది. అయితే సంజీవ్ ను ఓ పీడకల వెంటాడుతుంటుంది. ఆ కల వచ్చినప్పుడల్లా సంజీవ్ మానసికంగా కుంగిపోతుంటాడు. వైద్యులు కూడా దీనికి పరిష్కారం కనుక్కోలేకపోతారు. రోడ్డు ప్రమాదంలో తాను గాయపడినప్పటి నుంచి తన గతం మర్చిపోతాడు సంజీవ్. తన గతం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు నగరంలో పసి పిల్లల కిడ్నాప్ లు జరుగుతుంటాయి. పోలీసులు ఆ నేరస్తులను పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సంజీవ్ ను పోలిన వ్యక్తి ఒకరు ఆయన కూతురు అమ్మును స్కూల్ నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, అచ్చు సంజీవ్ లాగే ఉంటాడు ఆ నేరస్తుడు. ఇంతకీ ఆ నేరస్తుడు ఎవరు, అచ్చు సంజీవ్ లాగే ఎందుకు ఉన్నాడు. తన కూతురును సంజీవ్ ఎలా తిరిగి దక్కించుకున్నాడు అనేది మిగిలిన కథ.


విశ్లేషణ

సస్పెన్స్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ కలిపి దర్శకుడు యుగంధర్ ముని కొత్త తరహా ప్రయత్నం చేశారు. హద్దులు దాటిన పరిశోధనలు మానవాళికి ఎంత ప్రమాదకరమో ఆయన కథలో చెప్పకనే చెప్పాడు. ప్రకృతి విరుద్ధంగా మనిషి జీవించాలనుకోవడం సరికాదనే సందేశం కథలో కనిపిస్తుంటుంది. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను కథకు నేపథ్యంగా ఎంచుకోవడం కూడా కొత్తగా ఉంది. నాయిక ప్రీతి అస్రానీ ఈ చిత్రంలో తన వయసు కంటే మెచ్యూర్డ్ క్యారెక్ట్ చేసింది. ఒక ఉద్యోగిగా, ఇల్లాలిగా ఆమె ఫర్మార్మెన్స్ చాలా బాగుంది. మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న భర్తను రక్షించుకునే క్రమంలో ప్రీతి పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. నితిన్ ప్రసన్నకు తొలి చిత్రమైనా సహజంగా నటించాడు. ఆయన కనిపించిన అశ్వత్థామ, సంజీవ్, డాక్టర్ పాత్రలు వేటికవి భిన్నంగా కనిపిస్తుంటాయి. తొలి చిత్రంలోనే ఇన్ని పాత్రలు పోషించే అవకాశం కలగడం అతని అదృష్టం. సగటు ప్రేక్షకుడు కోరుకునే కమర్షియిల్ అంశాలకు ఈ కథలో చోటు లేదు. అదొక్కటే మైనస్ పాయింట్. రేటింగ్ లకు అతీతమైన మంచి ప్రయత్నమిది.

Rating: 3/5

Post a Comment

0 Comments